పూజాపరమైన పుస్తకాలతో నాకొక సమస్య ఉండేది…
ఆ మాటకొస్తే నాకే కాదు చాలామందిది ఇదే సమస్య…
ప్రతి పండుగకూ ఒక వ్రతకల్పం తీయాల్సి వస్తుంది. అందులో షోడశోపచార పూజా విధానం బాగోదు లేదా పసుపు గణపతి పూజా విధానం ఉండదు లేదా వ్రతకథ తప్పులు తడకలుగా ఉంటుంది. అష్టోత్తరాలు అయితే పంటి కింద రాళ్లల్లా తగులుతూ ఉంటాయి. అలా ఒకటి బాలేదని ఇంకోటి కొన్న పుస్తకాలు ఓ 10 ఉంటాయి. ఏ వినాయక చవితో వచ్చినప్పుడల్లా పది పుస్తకాల్లో దేన్ని ఎంచుకోవాలా అని తికమకపడడం!
ఆ మధ్యన ఎందుకో మా నాన్నగారు, శ్రీ ఆలూరు కృష్ణ ప్రసాద్ గారికి, వివిధ పండుగలకు దైవానికి సమర్పించే నివేదనలు అన్నింటిని ఒక పుస్తకంగా తెస్తే బాగుంటుందని అనిపించింది. ఈలోగా ఆస్ట్రేలియా నుంచి హేమలత గారినే ఆవిడ, వివిధ తెలుగు పండుగలు, నివేదనలను ఒక పుస్తకంగా తెస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చి, వీలైనంత ఆర్ధిక సహాయం కూడా అందించారు. నాకు ప్రతి ఏటా మనం జరుపుకునే వ్రత విధానాలన్నింటినీ వీటితో కలిపితే బాగుంటుందని అనిపించింది. అంతే మూడు నెలల క్రితం ఒక మహా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాము.
ఇందులో ఏముంది? అన్ని వ్రతకల్పాలు నివేదనలు ఒకచోటికి తేవడమే కదా, అని అనిపించవచ్చు. రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యస్వామి వంటి మన వేల్పులందరి షోడశోపచార పూజా విధానాలు సేకరించాలి. ప్రతి పండుగకు మనదైన విధానాల్లో పూజించే సంప్రదాయాల్ని మేళవించాలి. ఆయా వ్రత కథల్ని, సంబంధిత వేల్పుల అష్టోత్తరాల్ని సమీకరించాలి. వీటన్నింటినీ వీలున్నంతవరకు ఒకటికి పది సార్లు సరిచూసుకొని తప్పులు లేకుండా అందించాలి. అందుకే ఇది మాకు బృహత్కార్యం అయింది.
ఈ పుస్తకంలో దాదాపుగా తెలుగువారు తెలుగు నెలల వారీగా జరుపుకునే పండుగలు అన్నింటిని క్లుప్తంగా లేక విస్తారంగా తెలియపరిచాము. వరాహ చరమ శ్లోకం, వ్యాసమహర్షి వ్రాసిన అత్యంత ప్రభావవంతమైన రుక్మిణి కళ్యాణం, ప్రత్యేకమైన వారాహి మంత్రం,విశిష్టమైన శివాభిషేక నామాలు వంటి మాకు తెలిసిన అరుదైన వాటినన్నింటినీ, అందరి ప్రయోజనం కోసం ఈ పుస్తకంలో ఇమిడ్చాము.
ఇంత కష్టం తర్వాత, ‘ఖచ్చితంగా ఇది ప్రతి ఇంటా ఉండి తీరాల్సిన పుస్తకం’ అని నేను చెప్పగలను. మేము చేసిన ఈ కృషి నలుగురికీ ఉపయోగపడి, నలుగురి జీవితాలు ఆనందమయం అయితే అంతకన్నా కావలసినది ఏదీ లేదు!
Nivedana - నివేదన
Author: Aluru Krishna Prasad
No.of pages: 280
Published by: Acchamga Telugu Publications
Year of Publiacation: 2022
Price: 300rs