నీ ఊపిరి మరణమృదంగం…
నువ్వు నడిచేబాట వైతరిణీ తీరం…
ఏదో పుస్తకాలు వేసుకోడానికి సాయం చేయడమంటే రాముడి పుస్తకం వేసి భద్రాచలానికి, వెంకటేశ్వర స్వామి కథలు వేసి తిరుమలకి ఎంచక్కా తిరుగుతూ, ‘కృష్ణా రామ’ అనుకోవడం అని భావించాను. కానీ మొదటిసారి చదివినప్పుడే నా తాట తీసి, పుస్తకం పూర్తయ్యేదాకా ఉత్కంఠతో రాత్రంతా నన్ను కూర్చోబెట్టిన పుస్తకం… మృత్యువిహారి.
నాగరికులకు అంతులేని స్వార్ధం ఉంటుంది… కొండజాతివారికి కొన్ని నమ్మకాలుంటాయి… తాంత్రికులకు కొన్ని హింసాత్మక పూజలుంటాయి… యాత్రికులకు ప్రతి ప్రయాణంలో అనుకోని మలుపులుంటాయి. తనకు తెలియకుండానే, పైన తెలిపిన ముగ్గురి వలలో చిక్కుకున్న యాత్రికుడే విహారి.
ఎక్కడో అడవుల్లో హింసాత్మక పద్ధతిలో చేతబడి నివారించడానికి పూనుకున్న ఒక తాంత్రికుడికి అడ్డుపడతాడు విహారి. అందుకు కోపించిన తాంత్రికుడు నిన్ను ప్రేతం వెంటాడుతుందని, నీ ఊపిరి సోకిన వారంతా మరణిస్తారని, శపిస్తాడు. అప్పటినుంచి విహారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది.
అనుకోకుండా ‘తెల్లోడి గుమ్మటం’ గురించి తెలుసుకున్న విహారి, అటువంటివి దేశంలో మొత్తం నాలుగు ఉన్నాయని తెలిసి అవాక్కవుతాడు. తనను పలకరించిన చాలామంది చనిపోతూ ఉండడంతో ఉక్కిరిబిక్కిరవుతాడు. చివరికి అతను ప్రాణంగా ప్రేమించిన లహరిని కూడా కోల్పోతాడు… ఇంతటి విపత్కర స్థితిలో ఉంటూ కూడా, తనను పిచ్చివాడిగా నిరూపించాలని చూసినవారిని తప్పించుకుని, నిబ్బరం కోల్పోకుండా పోరాడి అతను కనుగొన్న ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి? చివరికి విహారి జీవితం ఏ మలుపులు తిరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే!
సస్పెన్స్ థ్రిల్లర్ లు ఇష్టపడే వారికి మృష్టాన్న భోజనం ఈ నవల! ఆద్యంతం చదివించే అద్భుతమైన శైలితో, అత్యంత ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన ఈ నవల తప్పక చదివి తీరాల్సిందే! ఆ ఉద్విగ్నతకు అంతాన్ని తెలుసుకోవాల్సిందే!
Mrutyu Vihari - మృత్యు విహారి
రచన: సుధీర్ కస్పా
పేజీలు : 160
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 200 రూ.