తెలుగు పంచ కావ్యాలలో మొదటిగా పేరొందినది మనుచరిత్రము . ఆంధ్ర కవితా పితామహ బిరుదాంకితుడు, అష్టదిగ్గాజాలలో ప్రథముడు, సాక్షాత్తు కృష్ణదేవరాయలిచే గండపెండేరం తొడిగించుకున్నవాడు, కవిత్వంలోనేకాక రాయల దిగ్విజయాలలో పాలుపంచుకుని ఆమాత్యునిగా మెలగిన అలసాని పెద్దనామాత్యుడు.
పాఠకులకు సులభంగా అర్థంకావటానికి బాలాంత్రపు రమణ గారు ఎంచుకున్న విధం ఇలాగ ఉంది. 1. కవి పరిచయం 2. కావ్యంలోని కథ (సులభమైన తెలుగులో), 3. పద్యాల సొబగులు. ఇప్పుడు ఒక్కొక్క అంశం పరిశీలిద్దాం:
1. కవి పరిచయం: ఒక కావ్యం గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆకావ్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఈకావ్యాన్ని రచించిన అలసాని పెద్దనామాత్యుడు ఎక్కడివాడు, ఎప్పటి వాడు ఇతని ఇతర రచనలేమిటి మొదలైన ఆసక్తికర విషయాలే కాక వారి కొన్ని చాటువులను, ప్రఖ్యాతి చెందిన సీసపద్యమాలికను మనకు వ్యాఖ్యాన సహితంగా మనకు రుచిచూపించారు శ్రీ బాలాంత్రపు రమణ గారు.
2. కథా విధానము: ఈభాగంలో కావ్యంలోని కథను క్లుప్తంగా మనముందుంచారు. చక్కని సరళమైన భాషలో ఎవరికైనా అర్ధమయ్యే రీతిలో చెప్పారు. ఊరికే కథ చెప్పటంతో వదలలేదు. ప్రవరుడు ఏ కాశీ ప్రయాగకో వెళ్ళక హిమాలయాలకే ఎందుకు వేళ్ళాడు అన్నది ప్రశ్న . ఈప్రశ్న కి సమాధానంకోసం నేను కూడా ఆలోచించాను.
అవును ఎందుకూ అని ఆలోచిస్తే నాకు తోచిన సమాధానం:
కావ్యారభంలోనే పెద్దన గారు మనకు ప్రవరుని వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తారు. ప్రవరుడు ఎంత అందగాడో, ఎంత ఐశ్వర్యవంతుడో, అంతటి నిష్టాగరిష్టుడు. వేద వేదాంగ పురాణ సకలశాస్త్ర కోవిదుడు. మహాదాత. అన్నిటికీ మించి సంపూర్ణంగా వైరాగ్యాన్ని వంటపట్టించుకున్న గృహస్తు. ఇంక హిమాచలమో? సమస్త పౌరాణిక సంఘటలకు ఆలవాలం. మహామహిమాన్వితులైన మహర్షుల నివాసస్థానం. ప్రకృతి సౌందర్య నిలయం. విరాగీఇన ప్రవరునికి అవకాశం దొరకగానే అటువంటి ప్రదేశానికి వెళ్లాలనిపించటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
మరొక కారణం ఏమంటే “బుద్ధి కర్మానుసారిణి” మన ఆలోచనలు, ప్రవర్తన అన్ని మన కర్మను బట్టివస్తాయి. ప్రవరుడు పరోక్షంగా మను వంశ సంభవానికి కారకుడయ్యాడు. అతని చేసిన వరూధిని అతని విరహంలో మాయారూపంలో వచ్చిన గంధర్వునిచే స్వరోచిని కుమారునిగా పొందింది. ఈ సర్వోచికే మన కథానాయకుడు, రెండవ మనువు అయిన స్వారోచిషుడు జన్మించాడు. ఇంతకథ జరగాలంటే ప్రవరుడు హిమాలయాలకు వెళ్లక తప్పదు. విధిలిఖితం జరగాల్సిందే.
ఇటువంటి పాఠకులను ఆలోచింపచేసే అనేక ప్రశ్నలు ఈ గ్రంధంలో మనకు అనేకచోట్ల తారసపడతాయి.
Manucharitramu Parichayamu - మనుచరిత్రము పరిచయము
రచన: బాలాంత్రపు వేంకట రమణ
పేజీలు : 152
ప్రచురించిన సంవత్సరం- డిసెంబర్ 2019
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 150 రూ.